
సంక్రాంతి పండుగ మన తెలుగు వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి. ఈ పండుగ వ్యవసాయం, కుటుంబ బంధాలు, సంప్రదాయాలు, ఆనందం అన్నింటిని కలిపి జరుపుకునే గొప్ప ఉత్సవం. పంటల కోత పూర్తైన తరువాత రైతులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆనందంగా గడిపే సందర్భమే సంక్రాంతి.
కేవలం ఒక రోజుతో పరిమితం కాకుండా, భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ అని మూడు రోజుల పాటు వివిధ ఆచారాలతో జరుపుకునే పండుగ ఇది. మరి సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారు అనే విషయాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందామా..
సంక్రాంతి పండుగకు ముందు సిద్ధమయ్యే విధానం
సంక్రాంతి పండుగకు కొన్ని రోజుల ముందు నుంచే మన ఇళ్లలో సందడి మొదలవుతుంది. మన అమ్మమ్మల కాలం నుండి చూస్తూనే ఉన్నాం కదా ఇంటి శుభ్రతకు మన పెద్దవాళ్లు ఎంతో ప్రాధాన్యం ఇస్తారో. పాత, ఉపయోగం లేని వస్తువులను తొలగించి, గోడలకు సున్నం వేసి ఇంటిని శుభ్రంగా ఉంచుతారు.
ధనుర్మాసం ప్రారంభం అవ్వగానే ఇంటి ముందు ప్రాంగణాన్ని శుభ్రం చేయడం ఇంటి ముందు ప్రతి రోజు ఉదయాన్నే నెల రోజుల పాటు వేసే నెల ముగ్గులు, చామంతి, బంతి పూలు మరియు మావిడి ఆకులతో గుమ్మాలకు కట్టే తోరణాలు, హరిదాసు కీర్తనలు, బొమ్మల కొలువులు, ఎన్నో ఇంకెన్నో అందమైన అనుభవాలు.
ధనుర్మాసాన్ని పవిత్రమైన కాలంగా భావించడం వల్ల, ఈ రోజుల్లో శుభ్రత, నియమాలు, భక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇవి ఇంటికి శుభం, సానుకూల శక్తి కలగాలని సూచించే అందమైన సంప్రదాయాలు. పిల్లలకు కొత్త బట్టలు కొనడం, పండుగ కోసం కావాల్సిన సామగ్రిని ముందుగానే తీసుకురావడం ఈ దశలో జరుగుతుంది.
భోగి రోజు పండుగ ఎలా జరుపుకుంటారు?
సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి. ఈ రోజున తెల్లవారుజామున లేచి తల స్నానం చేసి భోగి మంటలు వేయడం ప్రధాన ఆచారం. పాత చెక్కలు, పాత వస్తువులను మంటల్లో వేసి, పాతదాన్ని విడిచిపెట్టి కొత్తదానికి స్వాగతం పలుకుతారు. ఇది మన జీవితంలో మార్పును సూచిస్తుంది. అంతేకాకుండా భోగి రోజు ఉదయం నుంచే పిల్లలు రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తూ ఎంతో ఉత్సాహంగా గడుపుతారు.
ఉదయం భోగి మంటల్లో ఆవు పేడతో చేసిన పిడకల దండలు వేయటం
భోగి రోజు ఉదయం భోగి మంటల్లో పిల్లలు ఆవు పేడతో చేసిన పిడకల దండలను వేయడం సంప్రదాయం. కొన్ని ప్రాంతాల్లో పిల్లలను మంటల చుట్టూ తిప్పడం, అక్షింతలు చల్లడం వంటి ఆచారాలు కూడా ఉంటాయి. పిడకలు వ్యవసాయ జీవనంలో పవిత్రంగా భావించబడతాయి. పిడకల దండలు వేయడం ద్వారా ఇంట్లోని నెగటివిటీ తొలగిపోతుందని, కొత్త శుభ శక్తి వస్తుందని నమ్మకం. ఇది ప్రకృతి పట్ల కృతజ్ఞతను చూపించే ఒక సంప్రదాయంగా కూడా భావిస్తారు.
భోగి రోజు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టే సంప్రదాయం
భోగి రోజు ఉదయాన్నే ఇంటి ముందు రంగురంగుల రంగవల్లుల్లో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టడం మరో ముఖ్యమైన ఆచారం. పశువుల పేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గుల మధ్యలో ఉంచి, పూలతో అలంకరిస్తారు. ఇది ఇంటికి శుభం, సంపద కలగాలని సూచిస్తుంది. మహిళలు ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా చేస్తారు. గొబ్బెమ్మలు వ్యవసాయ సంస్కృతికి ప్రతీకగా భావిస్తారు.
భోగి రోజు సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోయటం
భోగి రోజు సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోయడం ఇంకో ముఖ్యమైన సంప్రదాయం. కొత్త బట్టలు వేసుకున్న పిల్లలను ఒకచోట కూర్చోబెట్టి, పెద్దలు వారి తల మీద రేగిపళ్ళు, ఉసిరికాయలు, చెరకు ముక్కలు, పూలు పోస్తారు. దీనిని భోగి పళ్ళు పోయటం అని అంటారు. ఈ సంప్రదాయం పిల్లలకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటూ చేయబడుతుంది. పిల్లలు ఆనందంగా నవ్వుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం భోగి పండుగకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
మకర సంక్రాంతి రోజున చేసే ఆచారాలు
రెండవ రోజు మకర సంక్రాంతి, ప్రధాన పండుగ రోజు. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి, కొత్త బట్టలు వేసుకుని పూజలు చేస్తారు. సూర్యుడికి ప్రత్యేక పూజలు చేయడం ఈ రోజు ప్రధాన ఆచారం. కొత్త పంటలతో చేసిన పాయసం, పొంగలి, ఇతర వంటకాలను దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయడం, బంధువుల ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. ఈ రోజున ఆనందం, ఐక్యత ప్రతి ఇంట్లో కనిపిస్తుంది.
సంక్రాంతి రోజున ప్రత్యేక వంటకాల ప్రాధాన్యత
సంక్రాంతి రోజున చేసే వంటకాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. కొత్త పంటలతో , చేసిన పొంగలి, పాయసం, ఇతర వంటకాలను దేవునికి నైవేద్యంగా సమర్పించి, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తారు.
కనుమ రోజున పండుగ ఎలా జరుపుకుంటారు?
మూడవ రోజు కనుమ. ఈ రోజు పశువులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. వ్యవసాయానికి సహాయపడే పశువులను శుభ్రంగా కడిగి, అలంకరించి, పూజలు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. బంధువులు, స్నేహితులు కలిసి బయటకు వెళ్లడం, ఆటలు ఆడటం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. కనుమ రోజు ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంది.
సంక్రాంతి పండుగలో పిండివంటలు మరియు అతిథి సత్కారం
సంక్రాంతి పండుగను పిండివంటలు లేకుండా ఊహించలేం. కొత్త బియ్యం,కొత్త నువ్వులు, బెల్లం ఉపయోగించి చేసే, అరిసెలు, పాకుండలు, నువ్వుల ఉండలు, పప్పు చెక్కలు, సకినాలు ఈ పండుగ ప్రత్యేకత. ఇంటికి వచ్చిన అతిథులను ఆదరంగా ఆహ్వానించడం, వారితో కలిసి భోజనం చేయడం సంప్రదాయం. ఆహారాన్ని పంచుకోవడం సంక్రాంతి పండుగలో ముఖ్యమైన భాగం. పండుగ రోజుల్లో ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. పంచుకునే మనసే కదా సంక్రాంతి పండుగ సారాంశం.
పిల్లలకు సంక్రాంతి పండుగ ద్వారా నేర్పే విలువలు
సంక్రాంతి పండుగ పిల్లలకు చాలా విషయాలు నేర్పుతుంది. పెద్దలను గౌరవించడం, కుటుంబంతో కలిసి ఉండడం, సంప్రదాయాలను పాటించడం వంటి విలువలు ఈ పండుగ ద్వారా పిల్లలకు అలవడతాయి. ఆధునిక కాలంలో కూడా ఈ సంప్రదాయాలు కొనసాగడం ద్వారా మన సంస్కృతి పిల్లలకు చేరుతుంది.
గ్రామాల్లో మరియు పట్టణాల్లో సంక్రాంతి పండుగ జరుపుకునే విధానం
గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. కోడి పందాలు, సంప్రదాయ ఆటలు, గ్రామీణ క్రీడలు కనిపిస్తాయి. పట్టణాల్లో అయితే కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇంట్లోనే పండుగ జరుపుకుంటారు. అయినా సంప్రదాయాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తారు. ఏ దేశంలో ఉన్నా, జీవనశైలి మారినా, పండుగ భావం మాత్రం అలాగే ఉంటుంది.
ఆధునిక కాలంలో కూడా సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత
ఈ రోజుల్లో జీవనశైలి మారినా, సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత తగ్గలేదు. నగరాల్లో నివసించే వారు కూడా తమ గ్రామాలకు వెళ్లి పండుగ జరుపుకోవాలని ఆసక్తి చూపుతున్నారు. ఇది సంక్రాంతి పండుగకు ఉన్న భావోద్వేగ విలువను తెలియజేస్తుంది.
ముగింపు
సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారు అనే ప్రశ్నకు సమాధానం ఒక్క వాక్యంలో చెప్పలేం. ఇది ఆచారాలు, సంప్రదాయాలు, ఆనందం, కుటుంబ బంధాల సమ్మేళనం. ఈ ఆనందాన్ని అనుభవించడమే తప్ప మాటల్లో చెప్పలేము.
ప్రతి ఇంట్లో కొత్త ఉత్సాహాన్ని నింపే ఈ పండుగ మనకు కృతజ్ఞత, ఐక్యత, పంచుకునే మనసును నేర్పుతుంది. అందుకే సంక్రాంతి పండుగ తెలుగు వారి జీవితంలో శాశ్వతమైన స్థానం సంపాదించుకుంది.
ఎంతో అందమైన ఈ పండుగని మీరు ఇంకా ఎంత అందంగా జరుపుకుంటారో…ఆ ఆనందాన్ని, ఆ జ్ఞాపకాలను మాతో తప్పకుండా పంచుకుంటారు కదూ…
గమనిక
ఈ వ్యాసంలోని సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ప్రాంతానుసారం సంక్రాంతి ఆచారాలు మారవచ్చు.